రాజకీయ కారణాలతోనే అనుమతి నిరాకరణ
అమెరికా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలు చెబుతా
లండన్ నుంచే హైదరాబాద్కు తిరుగు ప్రయాణంగా వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు23(క్విక్ టుడే న్యూస్):
తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే అనుమతి నిరాకరించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో బోస్టన్ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. లండన్ పర్యటన మాత్రం అనుకున్న విధంగానే విజయవంతంగా ముగిసిందని వెల్లడించారు. లండన్లో మూడు రోజులుగా నిర్వహించిన అధికారిక సమావేశాలు, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని సీఎం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. లండన్ పర్యటన అనంతరం నేరుగా అమెరికాలోని బోస్టన్ వెళ్లాల్సి ఉండగా, విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించడంతో ఆ ప్రయాణాన్ని విరమించుకోవాల్సి వచ్చిందన్నారు. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో లండన్ నుంచే హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ చేరుకున్న తర్వాత విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయం, దాని వెనుక ఉన్న రాజకీయ కారణాలు, తన విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. అదే సమయంలో, ఈ అంశంలో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తనకు, తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, దేశవ్యాప్తంగా తనకు అండగా నిలిచిన ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. లండన్లో గత మూడు రోజులుగా తనకు లభించిన అపూర్వమైన ఆదరణకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీవ్రంగా తప్పుబట్టిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు కేంద్రం ఈ విధంగా అడ్డంకులు సృష్టించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారని తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు బలమైన మద్దతుగా నిలిచిన ఖర్గేకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.





