
కృష్ణా జలాల మళ్లింపుపై రేవంత్ రెడ్డి సర్కారు ఉదాసీనత: హరీశ్ రావు ధ్వజం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా బేసిన్ దాటి కృష్ణా జలాలను తరలిస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు.
మల్యాం, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ కుడికాలువ, ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ చర్యల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తున్నారని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు లాంటిదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) కూడా ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించడం శోచనీయమని హరీశ్ రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.





