ప్రయాణికులకు సరక్షితమైన సేవలు అందించడమే ఆర్టీసీ లక్ష్యం
ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎన్. సుచరిత

చెంగిచెర్ల, జూలై 28 (క్విక్ టుడే న్యూస్):
ప్రయాణికులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించడం ఆర్టీసీ ప్రధాన లక్ష్యమని, అదే సమయంలో సంస్థ ఆదాయం పెరిగేలా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సికింద్రాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎన్. సుచరిత పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తే సంస్థ అభివృద్ధికి తోడ్పాటుగా నిలుస్తుందని ఆమె అన్నారు.
మంగళవారం చెంగిచెర్ల ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా సందర్శించిన ఆమె, ట్రాఫిక్, మెయింటెనెన్స్ విభాగాల పనితీరు, ఉద్యోగుల విధి నిర్వహణ, స్టోర్, టైర్లు, ఆయిల్ విభాగాల నిర్వహణను పరిశీలించారు. మరమ్మతులు జరుగుతున్న బస్సులను తనిఖీ చేసి, వాహనాల ఫిట్నెస్, సాంకేతిక ప్రమాణాలు, నిర్వహణ నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.
బస్సులు నిర్ణీత సమయానికి నడిచేలా చర్యలు తీసుకోవాలని, నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు ఇంధన పొదుపు, విడిభాగాల సమర్థ వినియోగం ద్వారా వ్యయాన్ని తగ్గించి సంస్థ ఆదాయాన్ని పెంచే దిశగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధిక ఆదాయం సమకూర్చిన కండక్టర్లు, ఇంధన పొదుపులో ప్రతిభ కనబరిచిన డ్రైవర్లను శాలువాలతో సన్మానించి నగదు బహుమతులు అందజేశారు.
అనంతరం డిపో ఆవరణలో మొక్కను నాటి నీరు పోసిన ఎన్. సుచరిత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎస్. స్వాతి, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ఆనందరావు, అసిస్టెంట్ మేనేజర్ (మెకానిక్) సత్తయ్య, కార్యాలయ సూపరింటెండెంట్ లక్ష్మీకళ్యాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మి, డిపో సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.



