కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే.. ఇందిరాపార్క్ మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన, బీఆర్ఎస్ పదేళ్ల పాలన మధ్య తేడాపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలకు ఈ సవాల్‌ను స్వీకరించే ధైర్యం ఉందా అని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భారీ అప్పుల భారాన్ని మోస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమై క్షణికానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. చదువుకున్నప్పటికీ సంస్కారవంతమైన రీతిలో వ్యవహరించడం లేదని విమర్శించారు. తెలంగాణ సంస్కృతి, సామాజిక ఉద్యమాలకు కాంగ్రెస్ గౌరవం ఇచ్చిందని మహేశ్ గౌడ్ అన్నారు. గద్దర్, అందెశ్రీ, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సర్దార్ సర్వాయి పాపన్న వంటి మహనీయులను గౌరవించిన ఘనత తమ పార్టీదేనని పేర్కొన్నారు. కేసీఆర్ తన కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసమే ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని ఆరోపించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడటంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు.



