ట్రాన్స్జెండర్లపై స్పెషల్ డ్రైవ్.. బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (క్విక్ టుడే న్యూస్):
శుభకార్యాలు, ఇతర సందర్భాల్లో కొందరు ట్రాన్స్జెండర్లు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి బెదిరింపులు, బలవంతపు వసూళ్లను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్ని కమిషనరేట్ల పోలీసు అధికారులను ఆదేశించనున్నట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ చింతల్లో గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా కొందరు ట్రాన్స్జెండర్లు రూ.50 వేల నగదు డిమాండ్ చేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సెప్టెంబర్ 4న కొత్త ఇంట్లోకి ప్రవేశించేందుకు వచ్చిన కుటుంబాన్ని కొందరు అడ్డుకుని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. తాము అంత మొత్తం చెల్లించలేమని చెప్పినా వారు వినలేదని, అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు శాపనార్థాలు పెట్టారని బాధితురాలు వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్.. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల తన దృష్టికి వస్తున్నాయని తెలిపారు.
తాను గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలోనూ బలవంతపు వసూళ్లు, బెగ్గింగ్ రాకెట్లపై ప్రత్యేక చర్యలు చేపట్టి వాటిని నియంత్రించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే, కొందరి చర్యల కారణంగా మొత్తం ట్రాన్స్జెండర్ సమాజాన్ని తప్పుబట్టడం సరికాదని డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పలువురు ట్రాన్స్జెండర్లు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వారు ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలను బెదిరించడం, శుభకార్యాల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని డీజీపీ స్పష్టం చేశారు. అన్ని కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి ఘటనలపై నిఘా పెంచి, ఫిర్యాదులు వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.



