పాలన చేతగాక తిట్ల పురాణం: ఎర్రవల్లి బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్

ఎర్రవల్లి, సెప్టెంబర్ 6 (క్విక్ టుడే న్యూస్):
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. పాలనపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సీఎం రేవంత్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తిట్లనే రాజకీయ అస్త్రంగా చేసుకునే వారితో చర్చించేందుకు అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులతో చర్చించి పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలే బీఆర్ఎస్ ప్రధాన అజెండాగా అసెంబ్లీలో పోరాటం సాగించాలని కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు. రైతులకు ఉద్దేశపూర్వకంగానే సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం వంటి కీలక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పంపులను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పారు.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీతో పాటు మండలిలోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, కాంగ్రెస్, బీజేపీ విధానాలను ప్రజలకు వివరించాలని అన్నారు. స్పీకర్ పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక విధానాలను కూడా సభలో ప్రస్తావించాలని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరై ప్రతి చర్చలో చురుగ్గా పాల్గొనాలని కేసీఆర్ సూచించారు. సమావేశాలను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు సమర్థవంతంగా పోరాడితే ప్రభుత్వం రక్షణాత్మక స్థితిలోకి వెళ్లేలా చేయాలని అన్నారు. మండలిలో పార్టీకి మెజార్టీ ఉన్నందున ప్రభుత్వంపై మరింత ప్రభావవంతంగా పోరాడాలని సూచించారు. తనపై సభలో ఎక్కువగా మాట్లాడేందుకు అధికారపక్షం ప్రయత్నిస్తుందని, వాటిని పట్టించుకోకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ పార్టీ సభ్యులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, పనితీరును ప్రజల ముందు ఎండగట్టాలని ఆదేశించారు. భూదందాలు, భూమాఫియా కొనసాగుతున్నాయని ఆరోపించిన కేసీఆర్.. భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశాలను అసెంబ్లీలో బలంగా ప్రస్తావించాలని అన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని కేసీఆర్ విమర్శించారు. దేశ రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ.. దిల్లీలో జెన్-జీ ఆందోళనల ప్రభావం బీజేపీపై పడిందని, దాన్ని అధిగమించేందుకు నియోజకవర్గాల పునర్విభజనకు ప్రయత్నాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని, అందుకే ఆ పార్టీ నేతలు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. తనపై వ్యక్తిగత విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నా వాటికి స్పందించకుండా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.



