మల్లారెడ్డి గారూ.. మాకు న్యాయం చేయండి
ప్లాట్ విషయంలో మోసపోయిన బాధితుల డిమాండ్

మేడిపల్లి, ఆగస్టు17(క్విక్ టుడే న్యూస్):
గతంలోనే అమ్మిన ప్లాట్ ను మరోసారి అమాయకులైన తమకు విక్రయించి మోసగించిన మల్లారెడ్డి సత్వరమే మాకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన గైని కళాధర్ తండ్రి బాలయ్య 2013లో సాలార్జంగ్ కంచ సత్యనారాయణపురం కాలనీ లోనే ప్లాట్ నెంబర్ ఇ/173 డాక్యుమెంట్ నెంబర్ 4744 / 2013 మామిడి సదాలక్ష్మి వద్ద కొనుగోలు చేశారు. అయితే దీనికి సంబంధించి లింక్ డాక్యుమెంట్లు ఈసీని పరిశీలించగా 2002లో రఘుపతి గౌడ్ అనే వ్యక్తికి కారెడ్ల మల్లారెడ్డి విక్రయించాడు. రఘుపతి గౌడ్ నుంచి సదాలక్ష్మి కొనుగోలు చేసింది. ఈ ప్లాటుకు సంబంధించి అన్ని లింక్ డాక్యుమెంట్లు, ఈసీ పరిశీలించి న తర్వాతే కళాధర్ కొనుగోలు చేశారు. కళాధర్ కొనుగోలు చేసిన వెంటనే ఎల్ఆర్ఎస్ చేయించకున్నాడు. అయితే ఇదే ప్లాటును 1982లోనే కారెడ్ల మల్లారెడ్డి సుమతి అనే మహిళకు విక్రయించారు.
ఈమె 2021లో రంగారెడ్డికి విక్రయించింది. ప్రస్తుతం ఈ ప్లాట్ లో నిర్మాణం చేపడుతున్నారు. దీనిని అడ్డుకునేందుకు బాధితులు ప్రయత్నం చేయగా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగారు. ఎలాగైనా మల్లారెడ్డి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాము అప్పట్లోనే రూ.18 లక్షలకు ప్లాటును కొనుగోలు చేశామని, ఇప్పుడు ప్లాట్ లేదు.. డబ్బులు లేకుండా పోయాయని వాపోయారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ముతో కొనుగోలు చేశామని, ఇప్పుడు తమ కుటుంబం రోడ్డుపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి చేసిన మోసం కారణంగా తాము మానసిక ఆందోళనకు గురవుతున్నామని, తమకు ఆత్మహత్యలే శరణ్యమైందని పేర్కొంటున్నారు. శ్రీ రమణ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కారెడ్ల మాల్లారెడ్డికి ప్లాట్లు గతంలోనే రిజిస్ట్రేషన్ అయిన విషయం తెలిసినప్పటికీ ఒకే ప్లాట్‌ను వేర్వేరు సర్వే నెంబర్లతో వేర్వేరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం దారుణమన్నారు. అతని ప్రవర్తన కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు తక్షణమే న్యాయం చేయాలని, తమకు విక్రయించిన ప్లాట్‌ను అప్పగించాలని కోరుతున్నారు.




