కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల యత్నం
అడ్డుకున్న పోలీసులు.. ఎర్రవెల్లిలో ఉద్రిక్తత

హైదరాబాద్, సెప్టెంబర్8(క్విక్ టుడే న్యూస్)::
దళితులను అవమానించారంటూ బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. దళిత సంఘాల నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి యత్నించారు. గజ్వేల్ నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.వెయ్యి మంది డప్పు కళాకారులతో కలిసి కేసీఆర్ ఫాంహౌస్ ఎదుట నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరగా.. పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. వరద రాజాపూర్ మీదుగా ఫాంహౌస్ సమీపానికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు నిలువరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఫాంహౌస్‌కు సుమారు అర కిలోమీటర్ దూరంలో డప్పులు మోగిస్తూ కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం బారికేడ్లను తోసుకుని ఫాంహౌస్ వైపు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి తీసుకువచ్చారు. నిరసనకారులను అదుపు చేసే క్రమంలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మరోవైపు కేసీఆర్ ఫాంహౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వమే పోలీసుల సహకారంతో కాంగ్రెస్ నేతలను ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది.





