
పీర్జాదిగూడలో వైభవంగా బోనాల ఉత్సవాలు
పీర్జాదిగూడ, ఆగస్టు9(క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పీర్జాదిగూడలోని ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిన బోనాలను ఎత్తుకొని ఆలయానికి చేరుకుని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.





