వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్
తొర్రూరు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్‌కుమార్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్నారం రోడ్డులోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ మైదానంలో మొక్కలు నాటారు.కార్యక్రమంలో చైర్మన్ శ్రావణ్‌కుమార్ పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.చెట్లు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడతాయని పేర్కొన్నారు.విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చని వాతావరణాన్ని పెంపొందించవచ్చన్నారు.మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు,విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు.నాటిన ప్రతి మొక్కను సంరక్షించి భవిష్యత్‌లో పెద్ద వృక్షాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్,వైస్ చైర్పర్సన్ సోమ రజని,కౌన్సిలర్లు, జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు,ఆర్పీలు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.





