జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థినుల ఎంపిక

- జనగామ, సెప్టెంబర్3(క్విక్ టుడే న్యూస్):
జనగామ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఆదర్శ హైస్కూల్ విద్యార్థినులు ఎంపికయ్యారు. గురువారం జనగామలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 విభాగంలో ఆదర్శ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న వి. హసిని ఎంపిక కాగా, అండర్-17 విభాగంలో 10వ తరగతి చదువుతున్న బానోతు ప్రతిభ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఆటలో చురుకుదనం, పట్టుదల, సమన్వయంతో రాణించి జిల్లా స్థాయికి తమ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పీఈటీ సంపత్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు. విద్యార్థినుల ఎంపిక పట్ల ఆదర్శ హైస్కూల్ కరస్పాండెంట్ పిన్నింటి ఉపేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ స్వాతిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. క్రీడల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు పాఠశాల తరఫున అవసరమైన ప్రోత్సాహం, శిక్షణ అందిస్తామని తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన హసిని, ప్రతిభను వారు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సెయింట్ పీటర్స్ ఫౌండేషన్ హైస్కూల్ చెందిన 13 మంది ఎంపిక..
అదే విధంగా నిడిగొండ మండలంలోని సెయింట్ పీటర్స్ ఫౌండేషన్ హైస్కూల్ చెందిన 13 మంది బాల, బాలికలు అండర్ 14, అండర్17 విభాగంలో వాలిబాల్, ఖోఖో, కబడ్డీ నుంచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పిన్నింటి ఉపేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.అపరంజనీ, పీఈటీ వంశీ విద్యార్థులను అభినందించారు.





