సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో… అలా మొదలైంది’.. విడుదల

కుటుంబ అనుబంధాలు, తండ్రీకూతుళ్ల మధ్య భావోద్వేగ బంధాన్ని ప్రధానంగా తీసుకుని, నేటి తరానికి అనుగుణమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ప్రముఖ దర్శకుడు చంద్ర మహేష్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో శనివారం రాత్రి గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరై సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ కథతో అనుసంధానం అవుతారని అన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఎక్కడో ఒకచోట ఎదురయ్యే అనుబంధాలు, భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించారని పేర్కొన్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను చూసి నటీనటులే భావోద్వేగానికి గురయ్యారంటే కథలోని ఎమోషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఎంతో అంకితభావంతో పనిచేశానని తెలిపారు. తన గత చిత్రాలతో పోలిస్తే ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందిస్తుందని చెప్పారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆకుల సురేష్ మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో చూసిన కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రూపొందించినట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని, మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ వేడుకలో సుమన్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, బీవీఎస్ రవి, వీర శంకర్, సముద్ర, రామ్ ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు పాల్గొన్నారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం చిన్న సినిమాలను ప్రోత్సహించే ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.





