ఐపీఎల్ 2027 వేలం గోవాలో నిర్వహణ
ఫ్రాంచైజీల అభ్యర్థనతో బీసీసీఐ కీలక నిర్ణయం

ఐపీఎల్ 2027 సీజన్ వేలానికి సంబంధించి నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. గత మూడు సార్లు విదేశాల్లో నిర్వహించిన వేలాన్ని ఈసారి భారత్లోనే జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఫ్రాంచైజీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. గోవాను వేదికగా ఎంపిక చేసినట్లు సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. వేలం తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉందని సైకియా సంకేతాలిచ్చారు. డిసెంబర్ 14 నుంచి 16 మధ్య తేదీల్లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇది మినీ వేలం కావడంతో ఒక్కరోజులోనే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. గత మూడు వేలాలు దుబాయ్, జెడ్డా, అబుదాబిలో జరిగాయి. విదేశాల్లో నిర్వహణ సందర్భంగా ఫ్రాంచైజీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడంతో ఈసారి భారత్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వేలానికి పది ఫ్రాంచైజీల ప్రతినిధులు, సిబ్బంది, అధికారులు సహా 100 మందికి పైగా హాజరుకానున్నారు. వారికి వసతి కల్పించేందుకు గోవాలో హోటళ్లను బుక్ చేయాల్సి ఉంటుంది. గోవా గతంలో 2009లో ఐపీఎల్ వేలానికి ఆతిథ్యం ఇచ్చింది. అంటే 17 ఏళ్ల తర్వాత మరోసారి ఈ కార్యక్రమం అక్కడ జరగనుంది. కాగా, వచ్చే ఏడాది మెగా వేలాన్ని మాత్రం విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



