
2027 వన్డే ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా బీసీసీఐ వ్యూహాత్మక ప్రణాళిక
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ మెగా టోర్నమెంట్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుత ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక మ్యాచ్‌లు షెడ్యూల్ లేనప్పటికీ, టోర్నమెంట్ జరిగే అక్కడి పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై భారత ఆటగాళ్లకు పూర్తి అవగాహన కల్పించాలని బోర్డు భావిస్తోంది. ఇందులో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో ప్రత్యేకంగా 4 నుండి 6 మ్యాచ్‌లు ఆడేలా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అక్కడి క్రికెట్ బోర్డుతో కూడా అనధికారికంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ప్రపంచకప్‌నకు ముందే ప్రత్యర్థి గడ్డపై అక్కడ మ్యాచ్‌లు ఆడటం వల్ల మన యువ మరియు సీనియర్ ప్లేయర్లు అక్కడి పిచ్ కండిషన్స్‌కు అలవాటు పడటంతో పాటు పట్టు సాధించడానికి ఎంతగానో దోహదపడుతుంది.





