తిరుమలలో భక్తులకు గుడ్‌న్యూస్.. 32 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

తిరుమల, సెప్టెంబర్16(క్విక్ టుడే న్యూస్):
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు 32 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఉచిత సేవలకు అందుబాటులోకి తెచ్చింది. దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు తిరుమలలోని వివిధ ప్రాంతాలను సందర్శించే వారు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుమల నారాయణగిరి సర్కిల్ వద్ద బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ 32 బస్సుల్లో 25 బస్సులను రిలయన్స్ ఫౌండేషన్, మరో 7 బస్సులను భారత్ బయోటెక్ సంస్థ టీటీడీకి విరాళంగా అందించాయి. వీటితో పాటు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లను కూడా రిలయన్స్ ఈవీ మొబిలిటీ, భారత్ బయోటెక్ సంస్థలు అందించాయి. ఈ ఏడాది జూన్‌లో తిరుమల పర్యటన సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు అందిస్తామని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు బస్సులను ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. బస్సుల ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబు నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకు ఓ ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించారు. ఆయన వెంట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రిలయన్స్ ఈవీ మొబిలిటీ సీఈవో నితిన్ సేథ్, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, టీటీడీ ఈవో రవిచంద్ర తదితరులు ఉన్నారు.
ఎస్వీ మ్యూజియం ప్రారంభం
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్రతో కలిసి మ్యూజియంలోని ప్రదర్శనలను పరిశీలించారు. శ్రీవారి మహత్యం, తిరుమల విశిష్టతను వివరించేలా వివిధ అంశాలను ప్రదర్శనకు ఉంచారు. శ్రీకృష్ణదేవరాయలు సహా వివిధ కాలాల్లో శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలు, చారిత్రక అంశాలు, శ్రీవారికి అలంకరించే కిరీటాలు, ఆభరణాలను త్రీడీ మోడళ్ల రూపంలో ప్రదర్శించారు. పానోరమిక్ స్క్రీన్‌పై ఏఐ సాంకేతికతతో రూపొందించిన శ్రీవారి పరిణయ విశేషాలను కూడా ప్రదర్శించారు. తిరుమలలోని ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి, భౌగోళిక విశిష్టతలను వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.





