ఖైరతాబాద్‌లో 69 అడుగుల ఎత్తులో మహాగణపతి

వినాయక చవితి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించిన మహాగణపతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో కొలువుదీరిన గణనాథుడికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా తొలి పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహాగణపతికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, ఖైరతాబాద్ గణేశుడికి దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉందని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాలు మహారాష్ట్రలో ఆరంభమైనప్పటికీ, 72 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉత్సవాలను నిర్వహించడం ప్రత్యేకత అని తెలిపారు. విఘ్నేశ్వరుడి కరుణతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహాగణపతికి భారీ కండువా, యజ్ఞోపవీతం సమర్పించారు. బడా గణేశుడి దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.





