వినాయక నిమజ్జనంలో విషాదం.. పెద్దకంజర్ల చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థుల మృతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 16 (క్విక్ టుడే న్యూస్):
వినాయక నిమజ్జన వేడుకలు ఓ అనాథాశ్రమానికి చెందిన విద్యార్థుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ శివారులోని నేరేడు చెరువులో గణేశ్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. దీంతో పండుగ సందడి నెలకొన్న ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. శిరీష అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులు గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లారు. నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కొందరు విద్యార్థులు లోతైన నీటిలోకి జారిపడినట్లు సమాచారం.
ఒకరిని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో మరికొందరు కూడా నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పటాన్చెరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహకారంతో చెరువులో గాలింపు చేపట్టి ఆరుగురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను నర్సింహ రాజు, సుమంత్, గణేశ్, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్, సిద్ధార్థ్గా గుర్తించారు. వీరిలో ఐదుగురు డిప్లొమా విద్యార్థులు కాగా, సిద్ధార్థ్ పదో తరగతి చదువుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అనాథాశ్రమ నిర్వాహకులను పరామర్శించి ఘటనపై విచారం వ్యక్తం చేశారు.





