తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’.. నేడు టీజర్ రిలీజ్

జాతీయ స్థాయిలో ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘హనుమాన్ అంశ్’. హిందీలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘హనుమాన్ అంశ్ - ఆంజనేయుడి అవతారం’ పేరుతో తెలుగులో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్ 14న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన సమర్పణలో ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ సెప్టెంబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. విడుదలకు సమయం దగ్గరపడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన మేకర్స్.. ఇందులో భాగంగా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా (మహరాజ్జీ) జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా, శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సత్తా చాటింది. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. పెద్దగా ప్రచార బడ్జెట్ లేకపోవడంతో చిత్రబృందం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాపై ప్రజల్లో ఆసక్తిని పెంచింది. ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్ టాక్ సినిమాకు మరింత బలంగా మారింది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం చిత్రాన్ని ప్రశంసించడంతో సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో ‘హనుమాన్ అంశ్’ తెలుగులోకి అడుగుపెడుతుండటంతో ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది.



