నాలుగు రోజులు ఇంటి నుంచి బయటకు రాలేకపోయా : రాధికా ఆప్టే

విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే.. తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా గుర్తుచేసుకున్నారు. గతంలో తాను నటించిన ఓ ఇంటిమేట్ సీన్ వీడియో లీక్ కావడంతో నాలుగు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోయానని వెల్లడించారు. ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 3’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. వీడియో తన చుట్టూ ఉన్నవారికి కూడా చేరడంతో మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని రాధిక తెలిపారు. తన డ్రైవర్, వాచ్‌మన్ కూడా ఆ వీడియో చూశారని చెప్పారు. ఆ సమయంలో తాను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండటంతో భద్రతపై మరింత ఆందోళన చెందానన్నారు. చివరకు డ్రైవర్, స్పాట్ దాదాతో నేరుగా మాట్లాడి.. తనకు అండగా ఉండాలని కోరినట్లు చెప్పారు. వారు తన పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించారని తెలిపారు. మరో సందర్భంలో యాక్షన్ సీన్ కోసం షర్టు బటన్ తీసి నటించాలని తనపై ఒత్తిడి తెచ్చారని, తాను అంగీకరించలేదని రాధిక వెల్లడించారు. నటీనటులకు, ముఖ్యంగా మహిళలకు ఇష్టం లేని పనులు చేయాలని ఒత్తిడి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 3’, ‘అక్క’ తదితర ప్రాజెక్టులతో రాధికా ఆప్టే బిజీగా ఉన్నారు. ‘రక్తచరిత్ర’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. పలు దక్షిణాది, హిందీ చిత్రాల్లో నటించారు.





