వనస్థలిపురంలోని సంకల్ప డీ-అడిక్షన్ సెంటర్లో వ్యక్తి మృతి

వనస్థలిపురం, సెప్టెంబర్ 14, (క్విక్ టుడే న్యూస్):
పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంకల్ప డీ-అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైకోర్టు కాలనీకి చెందిన గంజి నాగార్జున (37) కొంతకాలంగా మద్యానికి బానిసై ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం గురుద్వార్ రోడ్డు మార్గంలోని సంకల్ప డీ-అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. సెప్టెంబర్ 14న ఉదయం నాగార్జున బెడ్‌పై పడుకుని ఉండగా ఎంతకీ లేవకపోవడంతో సెంటర్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు నాగార్జునను సమీపంలోని ప్రాగ్మా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగార్జున మృతి చెందినట్లు ఆసుపత్రి డ్యూటీ వైద్యుడు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నాగార్జున మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.





