టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్లు
బోర్డు తీర్మానానికి నోయెల్ టాటా మినహా సభ్యుల మద్దతు

ముంబై, సెప్టెంబర్17:
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియాల్సి ఉండగా.. తాజా నిర్ణయంతో 2032 వరకు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖరన్ గత ఆగస్టు 12న టాటా సన్స్ బోర్డుకు తన పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి ఛైర్మన్ పదవిని కోరబోనని వెల్లడించారు. దీంతో ఆయన వారసుడి ఎంపికపై టాటా గ్రూప్‌లో చర్చ మొదలైంది. టాటా ట్రస్ట్స్ కూడా తదుపరి ఛైర్మన్‌ను ఎంపిక చేసే ప్రక్రియకు సిద్ధమైంది. అయితే తాజాగా టాటా సన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి మారిపోయింది. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న తీర్మానానికి బోర్డులో నోయెల్ టాటా మినహా మిగిలిన సభ్యులంతా మద్దతు తెలిపినట్లు సమాచారం. నోయెల్ టాటా మాత్రం ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రశేఖరన్ కొనసాగింపు విషయంలో బోర్డులో భిన్నాభిప్రాయాలు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.
చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపుపై గత కొంతకాలంగా అనిశ్చితి కొనసాగుతోంది. 2026 ఫిబ్రవరిలో జరిగిన బోర్డు సమావేశంలో మరో ఐదేళ్ల పాటు ఆయనను కొనసాగించాలన్న ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం లభించలేదని సమాచారం. దీంతో ఈ అంశం పలుమార్లు వాయిదా పడింది. అనంతరం ఆగస్టులో చంద్రశేఖరన్ స్వయంగా మరో పదవీకాలాన్ని కోరబోనని ప్రకటించడంతో వారసుడి ఎంపికపై ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు టాటా ట్రస్ట్స్ చర్యలు ప్రారంభించింది. చంద్రశేఖరన్ స్థానంలో కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసేందుకు కమిటీ ఏర్పాటుపై సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్ కూడా కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అయితే తాజాగా బోర్డు ఆయన కొనసాగింపునకు అనుకూలంగా తీర్మానం చేయడంతో సమీప భవిష్యత్తులో టాటా సన్స్ నాయకత్వ మార్పుపై నెలకొన్న ప్రశ్నలకు తాత్కాలికంగా తెరపడింది. 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్‌ను 2022లో రెండో ఐదేళ్ల కాలానికి తిరిగి నియమించారు. ఇప్పుడు మరో ఐదేళ్ల పొడిగింపునకు బోర్డు ఆమోదం తెలపడంతో టాటా సన్స్ నాయకత్వంలో ఆయన కొనసాగింపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే టాటా సన్స్ నియంత్రణ నిర్మాణం, భవిష్యత్‌లో సంస్థ లిస్టింగ్ అంశం, అలాగే కీలక వాటాదారుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.



