చైనాలో కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి.. 34 మంది గల్లంతు

బీజింగ్, జూలై 18:
నైరుతి చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాంగ్కింగ్ మునిసిపాలిటీ పరిధిలోని పెంగ్షుయ్ కౌంటీలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 10 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వుజియాంగ్ నది సమీపంలో కుండపోత వర్షాల కారణంగా కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు జారిపడటంతో 10కి పైగా ఇళ్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఆ సమయంలో ఇళ్లలో ఉన్న పలువురు శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటన నేపథ్యంలో చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ‘లెవెల్-II’ అత్యవసర ప్రతిస్పందనను అమలు చేసింది. అలాగే, విపత్తు నివారణ కమిషన్ ప్రత్యేక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపి సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 1,100 మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషాద ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు సమర్థవంతమైన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
