ఎస్బీఐలో 9,124 ఉద్యోగాలు.. ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) విభాగంలో 9,124 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 2026 డిసెంబర్ 31లోగా తమ ఉత్తీర్ణతకు సంబంధించిన ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. 2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 20, గరిష్ఠంగా 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
తాజా నియామకాల్లో భాగంగా హైదరాబాద్ సర్కిల్ పరిధిలో తెలంగాణకు 260 పోస్టులు కేటాయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు కల్పించారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఎస్బీఐ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
మూడు దశల్లో ఎంపిక
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో కొనసాగుతుంది. ముందుగా ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబర్ 26, 27, అక్టోబర్ 3 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించిన వారికి నవంబర్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. చివరిగా అభ్యర్థుల స్థానిక భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. అభ్యర్థులు ఒక రాష్ట్రంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. తాము దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషపై తప్పనిసరిగా పట్టు ఉండాలని ఎస్బీఐ స్పష్టం చేసింది. పోస్టుల సంఖ్య, అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని బ్యాంకు సూచించింది.





