నీట్ రద్దు చేయాలి.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

NEET : వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ (NEET) పరీక్షను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ మరోసారి గళమెత్తింది. నీట్ ప్రారంభమైనప్పటి నుంచీ ఈ పరీక్షను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి కె. అరుణ్‌రాజ్ మంగళవారం ఈ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకొచ్చారు. అధికార టీవీకే ప్రభుత్వానికి మిత్రపక్షాల మద్దతుతో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే కూడా తీర్మానానికి అనుకూలంగా నిలిచాయి. అయితే భాజపా సభ్యులు మాత్రం నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. తీర్మానంపై మంత్రి అరుణ్‌రాజ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరీక్ష కారణంగా విద్యార్థులు పాఠశాల విద్య కంటే ప్రైవేట్ కోచింగ్ సంస్థలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని అన్నారు.
అధిక ఫీజులు వసూలు చేసే కోచింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల యువత వైద్య విద్యలో అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. నీట్ విధానం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తోందన్నది తమిళనాడులోని వరుస ప్రభుత్వాల అభిప్రాయమని మంత్రి గుర్తుచేశారు. వైద్య కోర్సుల్లో ప్రవేశాలను 12వ తరగతి మార్కుల ఆధారంగా చేపట్టాలని ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో డీఎంకే ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని సూచించింది. ఇటీవల వెలుగుచూసిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం తన తీర్మానంలో ప్రస్తావించింది. పరీక్షకు సంబంధించిన తీవ్ర ఒత్తిడి కారణంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. నీట్‌ను రద్దు చేయడం ద్వారా విద్యార్థులపై ఈ ఒత్తిడిని తగ్గించవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది.





