
జగన్నాథ రథయాత్రలో అపశృతి
తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరు మృతి
పూరీ, జూలై16:
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా తీవ్ర రద్దీ నెలకొని అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రాండ్ రోడ్డులో భక్తుల రాక భారీగా పెరగడంతో తొక్కిసలాటకు దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటుండగా, వంద మందికిపైగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే సహాయక సిబ్బంది స్పందించి అస్వస్థతకు గురైన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. రద్దీ కారణంగా ఓ వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. అనంతరం అతడిని పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ఘటనపై అధికారుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అదే సమయంలో రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 120 మందికి వైద్య చికిత్స అందించినట్లు సమాచారం.





