యూకే వాణిజ్య ఒప్పందాన్ని తెలంగాణకు అనుకూలంగా మలుస్తాం
ఎగుమతుల పెంపుపై ప్రత్యేక కార్యాచరణ: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, జూలై16:
భారత్–యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) ద్వారా తెలంగాణకు గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. యూకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రు కె. అయ్యర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంతో భారత్ నుంచి యూకేకు ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలు తొలగించబడినట్లు గుర్తుచేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, రూ.32.56 లక్షల కోట్ల విలువైన వాణిజ్యానికి మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తులు, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, రక్షణ, ఐటీ, సెమికండక్టర్లు, చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానమని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, యూకే పెట్టుబడిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆహ్వానించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి యూకేకు సుమారు రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయని, కొత్త ఒప్పందంతో వాటిని మరింతగా పెంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రి అన్నారు. దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం, వ్యాక్సిన్ ఎగుమతుల్లో 30 శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. విమానయాన రంగానికి అవసరమైన అత్యాధునిక విడిభాగాల తయారీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి వివరించారు. ఎయిర్‌బస్, బోయింగ్, రోల్స్-రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, డసో ఏవియేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన విడిభాగాల తయారీ, నిర్వహణ సదుపాయాలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, సఫ్రాన్ వంటి ప్రముఖ సంస్థలు కూడా తెలంగాణలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఫార్చ్యూన్-500 సంస్థలతో పాటు 350కు పైగా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) కార్యకలాపాలు సాగిస్తున్నాయని మంత్రి తెలిపారు. సీఈటీఏ ఒప్పందం ద్వారా లభించే అవకాశాలపై స్థానిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు ఆయన సూచించారు. యూకే నుంచి భారత్‌కు వచ్చే మేయర్ల ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను కూడా సందర్శించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చంద్రు కె. అయ్యర్‌ను కోరారు. అలాగే తెలంగాణ అధికారులతో కలిసి యూకేను సందర్శించి అక్కడి పారిశ్రామిక, వాణిజ్య వ్యవస్థను అధ్యయనం చేయాలని చంద్రు కె. అయ్యర్ మంత్రిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో యూకే ప్రతినిధి బృంద సభ్యులు సిద్ధార్థ్ విశ్వనాథన్, నళిని రఘురామన్, ప్రవీణ్ పద్మనాభన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.




