గోల్కొండ కోటలో ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభం
జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

హైదరాబాద్, జూలై 16:
గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంగర్‌హౌస్ చౌరస్తాలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంస్కృతిక కళాకారుల అభ్యర్థన మేరకు మంత్రి కొండా సురేఖ ఈరగోల ధరించి వారితో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాఢ బోనాల ఉత్సవాల బుక్‌లెట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. అలాగే ప్రభుత్వం తరఫున గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీకి రూ.11 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అంతా బోనాల సందడి, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పండుగ వాతావరణంలో మునిగిపోయిందన్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా ఎల్‌నినో ప్రభావం తగ్గి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని, బోనాల ఉత్సవాల సందర్భంగా పెద్ద దేవాలయాలతో పాటు చిన్న ఆలయాలకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




