పేద విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్, జూలై15(క్విక్ టుడే న్యూస్):
పేద, దళిత, గిరిజన విద్యార్థుల విద్యాభవిష్యత్తును తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అర్హులైన ఒక్క విద్యార్థి కూడా గురుకుల విద్యకు దూరం కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని డీఎస్సీ భవన్లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తమ పిల్లలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో, అధికారులు అదే లక్ష్యంతో మానవీయ దృక్పథంతో పనిచేయాలని మంత్రి సూచించారు. దూర ప్రాంతాలు, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు సమీప జిల్లాల్లోనే సీట్లు కేటాయించాలని కోరారు. ఇతర జిల్లాల్లో ప్రవేశాలు లభించడం వల్ల రవాణా, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి, పేద కుటుంబాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు సాధ్యమైనంత వరకు వారికి అనుకూలమైన జిల్లాల్లోనే సీట్లు కేటాయించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్‌కు మంత్రి పలు సూచనలు చేశారు. సీట్ల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత, మానవీయ దృక్పథం, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకులు, బంధువులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారికి అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించాలని మంత్రి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.



