బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్-2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి..

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న **‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్-2026’**ను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండీ జి. ముకుందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ చైర్మన్ గిరిధర్‌రెడ్డితో కలిసి మంత్రి ఛాలెంజ్ అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. షార్ట్‌ఫిలింలు, బతుకమ్మ పాటలు, ఇతర సృజనాత్మక వీడియోల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించాలనుకునే యువ ఫిలిం మేకర్లకు ఈ ఛాలెంజ్ మంచి వేదికగా నిలుస్తుందని అన్నారు.
బతుకమ్మ పండుగ విశిష్టతతో పాటు తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రాలను రూపొందించవచ్చని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా సృజనాత్మకంగా ప్రతిబింబించే అవకాశం ఉందన్నారు. యువ దర్శకులు, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని మంత్రి ఆకాంక్షించారు. బతుకమ్మ వైభవాన్ని సృజనాత్మకతతో ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు తెలంగాణ సంస్కృతిని మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ ఛాలెంజ్ దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.



