రైతులకు అండగా నిలబడుతాం

సాగునీటి హక్కుల పరిరక్షణే లక్ష్యం
రైతుల సమస్యలు పరిష్కారించే వరకు పోరాటం
రంగనాయక సాగర్‌కు రైతు మహా పాదయాత్ర
సిద్దిపేట, జూలై19(క్విక్ టుడే న్యూస్):
రైతుల సమస్యల పరిష్కారం, సాగునీటి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు చేపట్టిన రైతు మహా పాదయాత్ర శనివారం ఉద్యమాన్ని తలపించేలా విజయవంతంగా సాగింది. అల్లిపూర్ నుంచి రంగనాయక సాగర్ వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ పాదయాత్రలో వేలాదిగా రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, యువకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచే మార్గమంతా ప్రజలు భారీగా తరలివచ్చి హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, డిల్లెం బల్లెం కళాకారుల విన్యాసాలు, జానపద కళారూపాలు, నినాదాలతో పాదయాత్రకు ఉద్యమ వాతావరణం నెలకొంది. గ్రామాల గుండా సాగిన ఈ యాత్రలో స్థానిక రైతులు తమ సమస్యలను హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లగా, వారికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పెద్దకోడూరు వద్ద పాదయాత్రలో ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వయంగా రైతులతో కలిసి నడుస్తూ వారికి సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి రంగనాయక సాగర్ వరకు రైతులతో కలిసి అడుగులు వేసిన ఆయన, సాగునీటి సమస్యలు, పంటల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారితో మాట్లాడారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో గులాబీ సైన్యం పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. మార్గమధ్యంలో పలుచోట్ల స్థానిక ప్రజలు, రైతు సంఘాల ప్రతినిధులు, మహిళలు హరీశ్‌రావుకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. పాదయాత్ర అంతటా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు, రైతులకు మద్దతుగా వినిపించిన నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. రంగనాయక సాగర్ వద్ద పాదయాత్ర ముగిసిన అనంతరం రైతులను ఉద్దేశించి హరీశ్‌రావు ప్రసంగించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, రైతు సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ మహా పాదయాత్రతో రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు పాల్గొన్న వారు పేర్కొన్నారు.

