బైక్ ఢీకొట్టడంతో ఎస్ఐ మృతి.. గణేశ్ నిమజ్జన బందోబస్తులో విషాదం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (క్విక్ టుడే న్యూస్):
గణేశ్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాదం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న కునుసోతు వెంకన్న హైదరాబాద్‌లో బందోబస్తు విధులకు వచ్చారు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు దాటుతున్న సమయంలో వెంకన్నను బైక్ ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదాన్ని గుర్తించిన పోలీసు సిబ్బంది వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హనుమకొండకు తరలించగా.. పరిస్థితి విషమించడంతో అదే రోజు సాయంత్రం మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనం, దానిని నడిపిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బైక్ ఆచూకీ, వాహనదారుడి వివరాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.



