పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్, సెప్టెంబర్15(క్విక్ టుడే న్యూస్):
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. అయితే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. పార్టీ నిర్దేశించిన హద్దులు, పార్టీ లైన్ దాటితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన తాజా పరిణామాలపై స్పందించారు. కాంగ్రెస్‌లో పార్టీ క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని అంతర్గత వేదికలపైనే చర్చించుకోవాలని సూచించారు. బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలను మాట్లాడి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధిష్ఠానం ఉపేక్షించదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని విస్తరించడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. తమ మధ్య గ్యాప్ ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరినీ గుర్తిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. నేతలు, కార్యకర్తలు పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణతో పనిచేయాలని మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు.





