జయరాజు ఇళ్లపై ఏసీబీ సోదాలు.. భారీగా నగదు, బంగారం గుర్తింపు

హైదరాబాద్, ఆగస్టు27(క్విక్ టుడే న్యూస్):
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజుపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజాము నుంచి ఆయనకు సంబంధించిన నివాసాలు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లితో పాటు హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్లోనే నాలుగు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. సోదాల్లో ఇప్పటివరకు జయరాజు ఇంట్లో రూ.1.50 లక్షల నగదుతో పాటు సుమారు 40 తులాల బంగారు ఆభరణాలను గుర్తించినట్లు సమాచారం. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.60 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్లో జీ+1 భవనం, పలు భూ పత్రాలు కూడా ఏసీబీ అధికారుల పరిశీలనలోకి వచ్చాయి. రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను సైతం గుర్తించారు.
అదేవిధంగా జనగామ జిల్లాలో జయరాజుకు చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమి వివరాలు కూడా అధికారుల తనిఖీల్లో వెలుగుచూశాయి. ఆయనపై గతంలో పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అక్రమాస్తుల వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ మాట్లాడుతూ.. జయరాజు నివాసంతో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తాండూరు, వరంగల్ ప్రాంతాల్లో ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నట్లు తెలిపారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉందని, తనిఖీలు పూర్తయిన తర్వాత జయరాజుకు సంబంధించిన ఆస్తులపై పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జయరాజు ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. మరోవైపు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరితో ఆయనకు సంబంధాలు ఉన్నాయంటూ గతంలో ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారా అనే కోణంలోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.





