
పీర్జాదిగూడ కమాన్ వద్ద చిక్కుకున్న భారీ గణనాథుడు
పీర్జాదిగూడ, సెప్టెంబర్ 9 (క్విక్ టుడే న్యూస్):
ఉప్పల్ నుంచి పీర్జాదిగూడకు తరలిస్తున్న భారీ గణనాథుడి విగ్రహం బుధవారం పీర్జాదిగూడ కమాన్ వద్ద చిక్కుకుంది. విగ్రహానికి ఉన్న భారీ కిరీటం కమాన్‌కు తగలడంతో ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను పరిష్కరించేందుకు నిర్వాహకులు తీవ్రంగా శ్రమించారు. చివరకు క్రేన్ సాయంతో కిరీటంలోని కొంత భాగాన్ని తొలగించి గణనాథుడిని అక్కడి నుంచి బయటకు తరలించారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగడంతో దాదాపు మూడున్నర గంటలకు పైగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ విగ్రహాలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఇప్పటికే మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.



