ఆర్యవైశ్య పేదలకు అండగా ఉంటాం
ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్, సెప్టెంబర్13(క్విక్ టుడే న్యూస్):
పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు సౌమ్యులు, మానవతావాదులుగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని, పేదల విశ్వాసానికి వారు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్నారని అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యుడు వేంనరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పేద ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ భవనం పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చూడాలని సంఘాల ప్రతినిధులకు సూచించారు. సాధారణ ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన మహాత్మా గాంధీ ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదగడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో గాంధీ విగ్రహాలు కనిపిస్తాయని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య అందించిన విశేష సేవలను ఆయన ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సరుకులను అరువుగా అందించే విషయంలో ఆర్యవైశ్యులు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వాసం, ముందుచూపు, జాగ్రత్తగా వ్యవహరించడం ఆర్యవైశ్యులలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలని వ్యాఖ్యానించారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా, సమైక్యంగా ఒకే తాటిపై నడిస్తే మరింత బలం చేకూరుతుందని సీఎం సూచించారు. తద్వారా రాజకీయాల్లో తమకు దక్కాల్సిన వాటాను తామే సాధించుకోగలరని అన్నారు. ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించామని గుర్తుచేశారు. ఆత్మగౌరవ భవన సముదాయం పేద ఆర్యవైశ్య కుటుంబాలకు, ముఖ్యంగా యువత, విద్యార్థులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.





