
రైతాంగం సుభిక్షంగా ఉండాలనే వరుణ యాగం
హైదరాబాద్: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా, గోదావరి నదులు జలకళతో తొణికిసలాడాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో ఈ మహా యాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ క్రతువును నిర్వహించనున్నారు.
మొత్తం 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలతో వైభవంగా కార్యక్రమం కొనసాగనుంది.
ఎల్‌నినో ప్రభావం రాష్ట్ర వర్షపాతంపై పడకుండా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో యాగాన్ని చేపడుతున్నట్లు దేవస్థానం పాలక మండలి వెల్లడించింది.
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది.
యాగం ముగింపు సందర్భంగా నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.
రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం, సమృద్ధిగా నీటి లభ్యత, ప్రజల సౌభాగ్యం కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.





