
ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న ఉచిత పథకాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
వీటి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భవిష్యత్‌లో ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కంటోన్మెంట్ బోర్డుకు సర్‌ఛార్జి బకాయిల చెల్లింపునకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ధనికులకు రైతుబంధు, ఖరీదైన వాహనాలు వినియోగించే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ప్రయోజనాలు అందించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఉచిత పథకాల ప్రభావంతో గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడుతోందని అభిప్రాయపడింది.
రేషన్ కార్డుల్లోని సభ్యుల సంఖ్య రాష్ట్ర జనాభాను మించి ఉండటంపైనా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో కంటోన్మెంట్ బోర్డుకు రూ.25.45 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా కోర్టుకు తెలిపారు.
మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు లభించింది





