హైదరాబాద్‌కు హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్.. డిసెంబర్ నుంచి అందుబాటులోకి కోర్సులు..
యూకేకు చెందిన బిజినెస్ స్కూళ్లు, విద్యా సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్17(క్విక్ టుడే న్యూస్):
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో యూకేకు చెందిన బిజినెస్ స్కూళ్లు, విద్యా సంస్థల ప్రతినిధులతో సీఎం చర్చించారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమొరియా, బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో పాటు సుమారు 30 మంది యూకే విద్యా సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ యూకే బిజినెస్ స్కూళ్ల డీన్లు, ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడారు. తెలంగాణలో విద్యా సంస్థలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విదేశీ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తే స్థానిక విద్యాసంస్థలు, పరిశ్రమలతో కలిసి పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ తదితర అంతర్జాతీయ విద్యాసంస్థలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీలు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన వంటి అంశాల్లో భాగస్వామ్యాలకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ అనుభవం, విదేశీ సంస్థలతో అనుసంధానం, ప్రపంచస్థాయి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్
మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుతో విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని వివరించారు.
గ్లోబల్ సమ్మిట్‌కు యూకే ప్రతినిధులకు ఆహ్వానం
డిసెంబర్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో పాల్గొనాలని యూకే విద్యా రంగ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ సదస్సు ద్వారా ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, పెట్టుబడిదారులు, పరిశ్రమలతో తెలంగాణకు మరిన్ని భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని సీఎం చెప్పారు. టీసీఎస్ రూ.70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు, అమెజాన్ భారీ పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. నర్సరీ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా విద్యా వ్యవస్థను మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.





