
ఏపీ, తెలంగాణలకు నూతన బీజేపీ ఇన్ఛార్జ్ల నియామకం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా సునీల్ బన్సల్ బాధ్యతలు చేపట్టనుండగా, కో-ఇన్ఛార్జ్లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను నియమించింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్గా అరవింద్ భదోరియాను, కో-ఇన్ఛార్జ్గా వనతి శ్రీనివాసన్ను ఎంపిక చేసింది.వీరితో పాటుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలకు ఇతర రాష్ట్రాల బాధ్యతలను సైతం అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ పురందేశ్వరిని ఒడిశా రాష్ట్ర ఇన్ఛార్జ్గా నియమించగా, తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణను తమిళనాడు కో-ఇన్ఛార్జ్గా పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది.
సంస్థాగత బలోపేతంలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.





