రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్, సెప్టెంబర్17(క్విక్ టుడే న్యూస్):
తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 20న ఓటర్ల నమోదుకు సంబంధించిన బహిరంగ నోటీసును జారీ చేస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 6 వరకు అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అనంతరం నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి పరిష్కరించిన తర్వాత డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కీలక సూచన చేశారు. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకున్న వారు సైతం ఈసారి తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పాత ఓటర్ల జాబితాలోని నమోదును ఆధారంగా చేసుకుని నేరుగా ఓటు వేసే అవకాశం ఉండదని, కొత్త జాబితాలో పేరు నమోదు చేసుకున్నవారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి వాణీదేవి, వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానానికి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వారి పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఎన్నికల ప్రక్రియకు ముందస్తుగా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.



