
బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు
నల్లగొండ క్రైమ్, సెప్టెంబర్ 10 (క్విక్ టుడే న్యూస్):
నల్లగొండ పట్టణంలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ట్రాన్స్జెండర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణ పోలీస్స్టేషన్లో డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ట్రాన్స్జెండర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. దుకాణాలు, ఇళ్లు, శుభకార్యాల వద్ద బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడటం, అసభ్యంగా ప్రవర్తించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాన్స్జెండర్లు కూడా సమాజంలో అంతర్భాగమేనని పేర్కొన్న డీఎస్పీ, వారి సమస్యలు ఏవైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.



