నిఘా నీడలో గణేష్ శోభాయాత్ర! జీరో యాక్సిడెంట్ - జీరో ఇన్సిడెంట్ లక్ష్యం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ, సెప్టెంబర్ 22 (క్విక్ టుడే న్యూస్)
జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. "జీరో యాక్సిడెంట్ - జీరో ఇన్సిడెంట్" లక్ష్యంగా భారీ భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 6,184 గణేష్ విగ్రహాలకు అనుమతులు ఇచ్చామని, నిమజ్జన ప్రక్రియ కోసం వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నల్లగొండతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ పట్టణాల్లో కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, గణేష్ శోభాయాత్ర పూర్తిగా నిఘా నీడలోనే సాగుతుందని స్పష్టం చేశారు.
విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలు:
నిమజ్జనంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా విగ్రహాల ఎత్తును బట్టి మార్గాలను ఖరారు చేశామని ఎస్పీ తెలిపారు. 10 అడుగుల లోపు చిన్న విగ్రహాలను బతుకమ్మ కుంట, వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయాలని, 10 అడుగులకు పైబడిన భారీ విగ్రహాలను వేములపల్లి కెనాల్ వద్ద నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ వద్ద FOB నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భారీ విగ్రహాలకు హాలియా వైపు నో ఎంట్రీ విధించినట్లు తెలిపారు. పూల్ చౌరస్తా నుంచి పానగల్ వరకు శోభాయాత్ర సాగే ప్రధాన మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రధాన రహదారుల్లో భారీ వాహనాలకు ప్రత్యేక డైవర్షన్లు ఏర్పాటు చేశామన్నారు.
డీజేలకు నో.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు:
నిమజ్జన శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. బాణాసంచా కాల్చినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు ఆల్కహాల్ మీటర్ తో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ నిఘా ఉంచామని, చిన్నపిల్లలను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని సూచించారు. భక్తులు, నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన వేడుకలను జరుపుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు.



