
సెప్టెంబర్ 18న నెట్ఫ్లిక్స్లో ‘మొద రాత్రి’
శోభనం నేపథ్యంలో సాగే కథలకు వెండితెరపై ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అందులో హాస్యాన్ని జోడిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇదే తరహా కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘మొద రాత్రి’ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రానికి రాజా కరుప్పస్వామి దర్శకత్వం వహించారు. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది. తాజాగా సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పెద్దలు కుదిర్చిన వివాహంతో తొలిసారి కలుసుకున్న ఓ యువకుడు, యువతి శోభనం రాత్రి ఎదుర్కొనే పరిస్థితులే కథకు ప్రధానాంశం. వారి జీవితాల్లో దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు ఏం జరుగుతుందనేది ఆసక్తికరం. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.





