
ఆటో కార్మికుకల సమ్మె విరమణ.. మంత్రి పొన్నంతో చర్చలు సఫలం
తెలంగాణవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆటోలు, క్యాబ్‌ల సమ్మెను ఆటో కార్మిక సంఘాల జేఏసీ విరమించింది.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు.
2015 తర్వాత ఛార్జీలు పెరగకపోవడంతో ఆటో ఛార్జీల సవరణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
సెప్టెంబర్ మొదటి వారంలో కార్మిక సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఓలా, ఉబర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్‌ను రూపొందించేందుకు ఐటీ శాఖతో కలిసి పనిచేస్తామన్నారు.
ఆర్టీసీ ఈవీ ఆటోలు కొనుగోలు చేస్తుందన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల సాయం, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.





