శంషాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బీభత్సం.. ఒకరి మృతి

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్లో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. కిషన్‌గూడకు చెందిన సెవెన్‌హిల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం ఉదయం వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కంటైనర్‌ను తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో అది నేరుగా రోడ్డును ఆనుకుని ఉన్న బాలాజీ భవన్ హోటల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో హోటల్లో టీ తాగుతున్న ఓ వ్యక్తిని బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కరీంనగర్‌కు చెందిన అజ్మల్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు ఢీకొనడంతో హోటల్ ఎదుట నిలిపి ఉంచిన మూడు కార్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





