నల్లగొండలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 17 (క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిప్యూటీ మేయర్ అమీర్, కార్పొరేటర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన రోజుగా సెప్టెంబర్ 17కు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు.
తెలంగాణ కోసం ఎందరో అమరవీరులు చేసిన త్యాగాల ఫలితంగానే నేటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం సాధ్యమైందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణను భవిష్యత్తులో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీస్ బలగాల కవాతు, దేశభక్తి నినాదాలతో పరేడ్ గ్రౌండ్ సందడిగా మారింది. వేడుకల్లో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



