అక్టోబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15:
దాదాపు ఆరేళ్లుగా పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపుల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. అక్టోబర్ 15 నుంచి వ్యాపారులకు చేసే రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలతో పాటు రూ.2,000 వరకు చేసే చిన్న మొత్తాల చెల్లింపులపై ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది. “యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. ఎండీఆర్ అనేది వ్యాపారుల చెల్లింపు వ్యవస్థలోని ఛార్జీ మాత్రమే.. వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు చెల్లించాల్సినది కాదు” అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యక్తులకు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి, కోటా లేదా ఇతర పరిమితులు ఉండవని పేర్కొంది. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన వ్యక్తి నుంచి వ్యాపారికి (ఎండీఆర్) చేసే యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ అమలవుతుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులకు ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300కు పరిమితం కానుంది. మించిన లావాదేవీలకు రూ.5 ఫ్లాట్ ఛార్జీ వర్తిస్తుంది. రూ.2,000 లోపు చెల్లింపులకు మాత్రం ఎలాంటి ఎండీఆర్ ఉండదు. మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లు, డీలర్ల ద్వారా జరిగే చెల్లింపులకు 0.02 శాతం ఎండీఆర్ విధించనున్నారు. దీనికి గరిష్ఠ పరిమితి రూ.300గా ఉంటుంది.
వ్యక్తిగత బదిలీలకు ఛార్జీ లేదు
వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిగే యూపీఐ బదిలీలపై ఎంత మొత్తం పంపినా ఎలాంటి ఛార్జీ ఉండదు. యూపీఐ లావాదేవీల పరిమాణంలో P2P లావాదేవీలు 37 శాతం ఉండగా, విలువ పరంగా వాటి వాటా 70 శాతంగా ఉంది. అలాగే రూ.2,000 వరకు జరిగే చిన్న మొత్తాల వ్యాపార చెల్లింపులు మొత్తం P2M లావాదేవీల్లో 95 శాతానికి పైగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. వీటిపై కూడా కొత్త ఛార్జీలు ఉండవు.
వినియోగదారులపై భారం వేయొద్దు
కొత్త ఎండీఆర్ భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యూపీఐ యాప్ ప్రొవైడర్లు ప్లాట్ఫామ్ ఫీజులు లేదా దాచిన ఛార్జీలు విధించకుండా నిషేధం విధించారు. అలాగే వ్యాపారులు ఎండీఆర్ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయకుండా చూడాలని బ్యాంకులకు సూచించారు. ఉదాహరణకు రూ.3,000 విలువైన కొనుగోలుపై 0.4 శాతం ప్రకారం రూ.12 ఎండీఆర్ ఉంటుంది. రూ.50,000 చెల్లింపుపై రూ.200 అవుతుంది. రూ.1 లక్ష చెల్లింపుకు లెక్క ప్రకారం రూ.400 వచ్చినప్పటికీ గరిష్ఠ పరిమితి రూ.300 మాత్రమే వర్తిస్తుంది.





