లోతుకుంటలోని 40 ఎకరాలు శాంతా శ్రీరామ్ సంస్థదే! : తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్, సెప్టెంబర్16(క్విక్ టుడే న్యూస్):
శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ లోతుకుంట ప్రాంతంలో ఉన్న సుమారు 40 ఎకరాల వివాదాస్పద భూమి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్కు చెందినదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ప్రభుత్వం నిర్ణీత సమయంలో సవాలు చేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ ఆలస్యంగా దాఖలు కావడంతో విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ప్రభుత్వ పిటిషన్‌పై శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ తరఫున కేవియట్ కూడా దాఖలైంది. సికింద్రాబాద్ పరిధిలోని వివాదాస్పద భూమి ప్రైవేటు వ్యక్తులు/సంస్థకు చెందినదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పు ప్రధానంగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లోని ఆలస్యానికి సంబంధించిన అంశాల నేపథ్యంలో వెలువడింది. లోతుకుంటలోని 40 ఎకరాల భూమి వివాదంలోనే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై గతంలో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. తాజాగా సుప్రీంకోర్టు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడంపై రంగనాథ్ స్పందించారు.
కాలపరిమితి ముగియడంతో సాంకేతిక కారణాల ఆధారంగానే పిటిషన్ కొట్టివేయబడిందని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని అన్ని భాగస్వామ్య వర్గాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జనరల్ ల్యాండ్ రిజిస్టర్ (జీఎల్ ఆర్) నంబర్ 243లో పేర్కొన్న 119 ఎకరాల భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని హైడ్రా కోరుతోంది. సర్వే ద్వారా లోతుకుంట భూముల హద్దులు, వాస్తవ పరిస్థితులు స్పష్టమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. లోతుకుంటలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న శాంతా శ్రీరామ్ బిల్డర్స్ లేఅవుట్‌కు, ప్రస్తుతం హైడ్రా పరిరక్షించిన ప్రభుత్వ భూమికి మధ్య సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉందని హైడ్రా హైకోర్టుకు నివేదించింది. సర్వే నంబర్లు 1, 2లోని ప్రైవేటు భూమికి సంబంధించి ఉన్న కోర్టు ఉత్తర్వులకు GLR నంబర్లు 243, 255తో ఎలాంటి సంబంధం లేదని హైడ్రా వాదించింది.భూ యాజమాన్యంపై ప్రభుత్వం, నిర్మాణ సంస్థ పరస్పరం ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించగా.. తాజాగా సుప్రీంకోర్టు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కాలపరిమితికి సంబంధించిన సాంకేతిక కారణాలతో కొట్టివేసింది.



