క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
ఆగస్టు 10 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, జూలై 20:
క్యూర్ (CURE) పరిధిలోని పేదలకు ఇంటి స్థలం కల్పించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించిన బ్రోచర్తో పాటు వాట్సాప్ ద్వారా దరఖాస్తు సదుపాయాన్ని సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, క్యూర్ పరిధిలోని ప్లాట్ల కోసం ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు మీ సేవ కేంద్రాలు, వాట్సాప్, అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు సమయంలో రూ.10 వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, లబ్ధిదారులను డ్రా విధానంలో ఎంపిక చేస్తామని వెల్లడించారు.
డ్రాలో ఎంపిక కాకపోయిన వారికి టోకెన్ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఎంపికైన వారికి స్థలాన్ని వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు, ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల సబ్సిడీ అందజేస్తామని మంత్రి తెలిపారు. కేటాయించిన స్థలాలను పదేళ్ల పాటు అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం నిషేధమని పేర్కొన్నారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, క్యూర్ పరిధిలో ఇల్లు లేదా స్థలం లేనివారికి తొలి విడతలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు విడతల్లో ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ప్రస్తుతం రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని పొంగులేటి వెల్లడించారు.
ఇప్పటివరకు సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వం, ఇకపై ఇంటి స్థలం లేని పేదలకు కూడా స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, మొత్తం 7,680 ప్లాట్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు అందిస్తామని, భవిష్యత్తులో మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నగరానికి దూరంగా నిర్మించిన ఇళ్ల వల్ల ప్రజలకు ఉపయోగం లేకపోయిందని విమర్శించిన మంత్రి, ఈసారి నగరానికి సమీపంలోని విలువైన ప్రాంతాల్లో పేదలకు గృహ స్థలాలు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్లో అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ విభాగాన్ని పునరుద్ధరించి, స్థలం లేని పేదలకు స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. వచ్చే బోనాల నాటికి తొలి విడత ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.


