
ఎల్‌నినో కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి
రైతులకు సూచించిన వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్
హైదరాబాద్, జూలై27(క్విక్ టుడే న్యూస్):
వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ సూచించారు. పాడి రైతులు పశుగ్రాసం కోసం మేత జొన్న సాగు చేయాలని, నగర సమీప రైతులు కూరగాయల సాగుతో మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం వెల్జర్ల గ్రామ రైతు వేదికలో నిర్వహిస్తున్న విత్తన మేళాను ఆయన సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. వర్షాభావ పరిస్థితులు, పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల్లో కందులు, పెసలు, మినుములు, కూరగాయలు, మేత జొన్న తదితర నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఈ విత్తన మేళా ఈ నెల 29 వరకు కొనసాగుతుందని, రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనువైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.





